రూ.100 కోట్ల క్లబ్‌లో 576 మంది
భారత్‌లో అధిక ఆదాయం ప్రకటించే వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ల వృద్ధి, స్టార్టప్‌ల విస్తరణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో దేశంలో రూ.100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ప్రకటిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమర్పించిన గణాంకాల ప్రకారం, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని ప్రకటించిన వ్యక్తుల సంఖ్య 576 కు చేరింది. 2021 -22లో ఈ సంఖ్య 142గా ఉండగా, 2024 -25లో 415కు, 2025 -26లో 576కు పెరిగింది. ఐదేళ్లలోనే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరగడం విశేషం.
అయితే, ఆదాయపు పన్ను చట్టంలో ‘బిలియనీర్’ అనే పదానికి ప్రత్యేక నిర్వచనం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో (ITR) రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించిన వారి ఆధారంగానే ఈ గణాంకాలను రూపొందించినట్లు తెలిపింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ఆదాయం ప్రకటించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం దేశంలో సంపద సృష్టి వేగవంతమవుతున్నదనడానికి సంకేతం. అలాగే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరగడం వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి మరింత ఆర్థిక బలం లభించే అవకాశం ఉంది.

