Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

అధికారంలోకి వస్తే బొట్టు నిబంధన తప్పనిసరి: బండి

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫాతిహా నేర్చుకోవాలని హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండించిన ఆయన, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ విద్యార్థులపై మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దడం సరికాదని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంపై సమాజంలోని అన్ని వర్గాలు స్పందించాలని, సెక్యులర్ వాదులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన బండి సంజయ్, అప్పటి ప్రభుత్వం హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. హిందూ విద్యార్థులకు బొట్టు ధరించడం తప్పనిసరి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇటీవల ఆటో డ్రైవర్ భరత్‌ను వేధించిన ఘటనపై కూడా స్పందించిన ఆయన, బాధ్యులైన పోలీసు అధికారులు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరికీ సమాన న్యాయం జరగాలని, మతం పేరుతో ఎవరినీ అవమానించే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని బండి సంజయ్ స్పష్టం చేశారు.