భోగాపురం క్రెడిట్‌పై జగన్ విమర్శలు
తాడేపల్లి : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. “పని వైసీపీది.. ప్రచారం చంద్రబాబుది” అంటూ విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు పెద్దగా చేసిందేమీ లేదని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్న జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటం ఆనందదాయకమని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రలో వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ప్రాజెక్టు పురోగతికి అసలు పునాది వైసీపీ ప్రభుత్వమే వేసిందని జగన్ పేర్కొన్నారు. 2020లో జీఎంఆర్‌తో కన్సెషన్ ఒప్పందం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పర్యావరణ అనుమతులు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక వసతులన్నీ తమ హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, మౌలిక వసతులు, రహదారులు, సబ్‌స్టేషన్ తదితర పనుల కోసం మొత్తం రూ.1,200 కోట్లకు పైగా ఖర్చు చేశామని వివరించారు.
కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పనులు ఆపకుండా కొనసాగించి, 2024 ఎన్నికల నాటికి రన్‌వే, టెర్మినల్ నిర్మాణాన్ని కీలక దశకు తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైందంటే అది వైసీపీ ప్రభుత్వ కృషి ఫలితమేనని పేర్కొన్నారు.
అలాగే విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి సరైన కనెక్టివిటీ రోడ్డు ఇప్పటికీ పూర్తికాలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రూ.6,300 కోట్ల వ్యయంతో 55 కిలోమీటర్ల ఆరు లేన్ల రహదారికి ఆమోదం తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రెండేళ్లుగా ఆ రోడ్డు నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబు రాజకీయ శైలిగా మారిందని విమర్శించిన జగన్, కనీసం ఇప్పటికైనా ఆ ధోరణిని మార్చుకోవాలని హితవు పలికారు.

