డీజీపీకి శుభాకాంక్షలు తెలిపిన సిరాజ్
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్, తెలంగాణ డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్ తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా కొత్త బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ డీజీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అనంతరం సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, “తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ సార్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఆత్మీయ సమావేశానికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
టీ- 20 ప్రపంచకప్- 2024 విజేత భారత జట్టులో సభ్యుడైన సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గతంలో గ్రూప్ -1 కేడర్‌లో డీఎస్పీ ఉద్యోగాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది.
ఈ భేటీ సందర్భంగా పోలీసు యూనిఫామ్‌లో కనిపించిన సిరాజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలుపుతూ “డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ” అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. క్రికెట్ మైదానంలో వేగవంతమైన బౌలర్‌గా గుర్తింపు పొందిన సిరాజ్, ఇప్పుడు పోలీసు యూనిఫామ్‌లో కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

