బాలకృష్ణ చేతుల మీదుగా పనుల ప్రారంభం
శ్రీ సత్యసాయి జిల్లాలోని రాచపల్లి వద్ద రూ.750 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మడకశిర –రాచపల్లి హంద్రీనీవా కాలువ విస్తరణ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ స్వయంగా హిటాచి వాహనాన్ని నడిపి కాలువ తవ్వకం పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. హిందూపురం, పెనుగొండ, మడకశిర ప్రాంతాల రైతులకు మడకశిర బ్రాంచ్ కెనాల్ వరప్రదాయినిగా నిలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక చొరవతోనే ఈ ప్రాజెక్టుకు రూ.750 కోట్ల నిధులు మంజూరయ్యాయని, పనులు కూడా వేగంగా ప్రారంభించగలిగామని తెలిపారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి కేటాయించిన రూ.25 వేల కోట్లలో 51 శాతం నిధులను రాయలసీమకే కేటాయించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కూటమి ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, జలవనరుల శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కాలువ విస్తరణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.

