హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా (ఏడీఎన్ఎన్) – కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న అమృత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు డొంగ్లీ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థినిగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నేతలు, మృతురాలి కుటుంబ సభ్యులు హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ మృతదేహాన్ని తరలించకుండా నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై ఆర్డీఓ రవీందర్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

