ఆధునిక రహదారులతో అభివృద్ధికి బాటలు
రాష్ట్రంలో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్‌లో రూ.338 కోట్ల వ్యయంతో హ్యామ్ విధానంలో చేపట్టనున్న నాలుగు లైన్ల ఆధునిక రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి నాణ్యమైన రహదారులు, ప్రభుత్వ పాఠశాలలు, వైద్య రంగం బలోపేతం కావడం అత్యంత అవసరమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.338 కోట్లతో రహదారుల నిర్మాణంతో పాటు, మరో రూ.100 కోట్లతో ఇతర రోడ్ల అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, హ్యామ్ విధానంలో నియోజకవర్గంలోని 140 రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధి అవకాశాల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కోహెడలో రూ.2,300 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

