Breaking Newshome page sliderHome Page SliderTelangana

మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ అధికారులు నోటీసులు గురువారం జారీ చేశారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులను అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌ వయస్సు దృష్ట్యా పోలీస్‌ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని సిట్‌ స్పష్టం చేసింది. విచారణ నిర్వహణకు అనువైనట్లుగా హైదరాబాద్‌ నగర పరిధిలోని ఏదైనా ప్రాంత వివరాలను తెలియజేయాలని సూచించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, అలాగే మాజీ ఎంపీ సంతోష్‌రావును సిట్‌ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు . ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్య అని కొట్టిపారేశారు. తెలంగాణ జాతి పితగా కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడైన కేసీఆర్‌పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. పరిపాలన చేతకాక, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన కుతంత్రాలకు పాల్పడుతోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో ఈ నోటీసుల డ్రామా ఆడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారంతో వ్యవహరిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.చావునోట్లో తలబెట్టి ‘కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో’ అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, రైతుబంధు, దళిత బంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన విజనరీకి నోటీసులు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనని ఆయన ధ్వజమెత్తారు. “అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడు విచారణల పేరుతో డ్రామాలు ఆడుతోంది. ఇది విచారణ కాదు.. పక్కా ప్రతీకారం.. ఇది న్యాయం కాదు.. కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే” అని కేటీఆర్ తన ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. మరోవైపు, కేసీఆర్‌కు నోటీసులు అందడంతో కేటీఆర్, హరీశ్‌రావు తదితర నేతలు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుని లీగల్ టీమ్‌తో అత్యవసరంగా భేటీ అయ్యారు. రేపటి విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేక న్యాయపరమైన రక్షణ కోరుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.