71 ఏళ్ల నీట్ అభ్యర్థి కోర్టుమెట్లు ఎక్కాడు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన 71 ఏళ్ల అశోక్ బహార్ నీట్ యూజీ పరీక్ష రాసిన అత్యంత వృద్ధ అభ్యర్థిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన మరో కీలక డిమాండ్‌తో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో సీనియర్ సిటిజన్లకు 1 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ లక్నో బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించాలనే ఉద్దేశంతో తాను నీట్ పరీక్ష రాశానని అశోక్ బహార్ తెలిపారు. ప్రస్తుతం నేషనల్ మెడికల్ కమిషన్, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నీట్ పరీక్ష రాయడానికి గరిష్ట వయోపరిమితి లేకపోతే, మెడికల్ సీట్ల కేటాయింపులో కూడా వృద్ధులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన వాదిస్తున్నారు.
వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు లేదా ఇతర ప్రయోజనాలు ఉన్నప్పుడు, సీనియర్ సిటిజన్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
దేశంలో వైద్య విద్యకు తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ ఆసక్తికర చర్చకు దారితీసింది. వృద్ధాప్యంలోనూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలా అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు జూలై 21న విచారణ చేపట్టనుంది.

