ప్రియుడితో కలిసి కుమారుడిపై దాడి
చిత్తూరు జిల్లా (ఏడీఎన్ఎన్) – చిత్తూరు జిల్లా వి.కోటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, వి.కోటకు చెందిన మహిళకు ఎర్రచేను గ్రామానికి చెందిన రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ ఏకాంతానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ కొంతకాలంగా చిన్నారిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం ఇద్దరూ కలిసి బాలుడిపై బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై దర్యాప్తు చేపట్టారు. చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

