Andhra Pradeshhome page sliderHome Page SliderNewsPolitics

‘క్వాంటం వ్యాలీ’గా అమరావతి

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026ను ప్రారంభించిన సీఎం
23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు..
వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్..
విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ మా నినాదం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదిక కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన “ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ -2026” సదస్సును ఆయన ప్రారంభించి, కీలక ప్రసంగం చేశారు. ఒక చిన్న ఆలోచనను సైతం పెద్ద పరిశ్రమగా మార్చే అద్భుత అవకాశం కేవలం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకే ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదేనని, అందుకే ఏపీలో సరికొత్త ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల విధానాన్ని సైతం తెచ్చామని సీఎం వెల్లడించారు.

పరిశ్రమలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఇప్పటికే రూ. 500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేశామని, రూ. 200 కోట్లతో ‘క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం శంకుస్థాపన చేసిన 38 పార్కులతో కలిపి, ఇప్పటివరకు మొత్తం వంద పార్కులకు శంకుస్థాపనలు పూర్తి చేశామని తెలిపారు. వివాదాల్లేకుండా భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సైతం ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఏపీ నుంచి కనీసం వంద ‘యునికార్న్’సంస్థలను సృష్టించడమే తమ లక్ష్యమన్నారు.

‘వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్’విధానాన్ని ప్రభుత్వం బలంగా ముందుకు తీసుకెళ్తోందని సీఎం చెప్పారు. ప్రస్తుతం డ్వాక్రా మహిళా సంఘాల వద్ద రూ. 28,000 కోట్ల భారీ కార్పస్ ఫండ్ ఉందని, దీని ఆధారంగా ఈ ఒక్క ఏడాదిలోనే 5 లక్షల మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువత స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామన్నారు. రాబోయేది ‘నాలెడ్జ్ ఎకానమీ’అని, “విలేజ్ టు గ్లోబల్ మార్కెట్” అనేది తమ ప్రభుత్వ ప్రధాన నినాదమని చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామిక రంగంలో మెటా, అమెజాన్ , జోహో లాంటి గ్లోబల్ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర భవిష్యత్ సాంకేతిక హబ్‌లపై సీఎం కీలక ప్రకటనలు చేశారు. అమరావతి ఇకపై ‘క్వాంటం వ్యాలీ’గా మారుతుందని, ఇక్కడ క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, యువత దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. విశాఖపట్నాన్ని ప్రపంచానికే ‘డేటా సెంటర్’గా మారుస్తున్నామని, రాష్ట్రానికి స్టీల్, అల్యూమినియం, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కీలక పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఇక రాయలసీమ రీజియన్‌ను రూ. 40,000 కోట్లతో ఉద్యానవన హబ్‌గా మారుస్తూనే, పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేవలం 36 రోజుల్లోనే 5వ జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీని రాయలసీమలో ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు.

ప్రధాని మోదీ ఇచ్చిన “చిప్ టు షిప్” పిలుపునకు అనుగుణంగా మాన్యుఫాక్చరింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం చంద్రబాబు వివరించారు. నెలకు రూ. లక్ష కోట్ల చొప్పున గత 23 నెలల కాలంలో రాష్ట్రానికి రూ. 23 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగామని స్పష్టం చేశారు. తాము కేవలం ఒప్పందాల కే పరిమితం కాకుండా.. పరిశ్రమలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ అయ్యేలా చూస్తున్నామన్నారు. “సైనింగ్ , గ్రౌండింగ్, ఓపెనింగ్ ” అనేదే తమ ప్రభుత్వ తారకమంత్రమని చెప్పారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదిక తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు భారీ కన్వెన్షన్ సెంటర్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమ్మిట్‌లో ప్రకటించారు.