సాయికృష్ణ డెత్ కేసుపై సీబీఐ విచారణ జరపాలి
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు భారతదేశంలోనే అత్యంత అరుదైన కేసు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అభివర్ణించారు. గుంటూరులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ లేదా ఎన్‌ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు, జనసేన పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నేను చాలా స్పష్టంగా చెబుతున్నా.. సాయికృష్ణను చంపేశారు. ఎవరో ఒక పెద్ద నేరస్థుడిని రక్షించేందుకే అతన్ని బలి చేశారు. ఒక మనిషిని చంపడం, బూడిద చేయడం, ఆపై సాక్ష్యాధారాలు లేకుండా చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు వేసిన సిట్ విచారణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సీబీఐ దర్యాప్తు జరిగితేనే అసలు నిజాలు,లబ్ధిదారులు ఎవరో బయటకు వస్తాయి,” అని అంబటి పేర్కొన్నారు.
చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లలో 18 నెలల పాటు సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాల్సి ఉంటుందని, అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజీలు మాయం కావడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని అంబటి రాంబాబు అన్నారు. నిందితులైన పోలీసులను కాపాడటానికే ఈ ఫుటేజీలను మాయం చేశారని, ఈ విషయాన్ని ఎల్లో మీడియా సైతం ప్రచురించిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సాయికృష్ణ లాకప్ డెత్ కేసును ‘మేకప్’ చేసే కార్యక్రమం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
సాయికృష్ణపై కేవలం 2 కేసులు మాత్రమే ఉన్నాయని, కానీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం 22 కేసులు ఉన్నాయంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. “శిక్షించడానికి పోలీసులు ఎవరు? శిక్షలు ఏవైనా చట్టబద్ధంగానే ఉండాలి. సాయికృష్ణను పోలీసులు కొట్టినట్లు ఆధారాలుగా నేను ఫొటోలు ఇచ్చాను. ఒకవేళ అతను బతికే ఉన్నాడని భావిస్తే.. ఎక్కడున్నాడో చెప్పండి,” అని సవాల్ విసిరారు.జనసేన నేతలు బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, ఈ హత్యాకాండకు, సీఐ నాగరాజుకు మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ వ్యవహారంపై జనసేనలోని కాపు నేతలే ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా కులాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు.
గుంటూరులో వైసీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు అంత ఉలిక్కిపాటు ఎందుకని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరగాలంటే ఈ కేసును తక్షణమే సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.

