ప్రజల వద్దకే ప్రభుత్వం
పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ప్రజా పాలన శకానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. “ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన” అనే ఇందిరమ్మ రాజ్యపు ఆశయాన్ని నిజం చేస్తూ, సామాన్యులు తమ చిన్న చిన్న సమస్యల కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే అవసరం లేకుండా ఈ ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ వేదిక ద్వారా అధికారులందరినీ నేరుగా ప్రజల ముంగిటకే నిలబెట్టి, క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తున్నారు.ఈ ప్రజా దర్బార్‌లో జిల్లా కలెక్టర్‌తో పాటు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే చోట అందుబాటులో ఉంటారు. రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మరియు స్థానిక మౌలిక సదుపాయాల వంటి ఏ రకమైన ఫిర్యాదుకైనా తక్షణ పరిష్కారమే ధ్యేయంగా మంత్రి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం విశేషం.ఈ నెల 25వ తేదీ శనివారం నాడు నేలకొండపల్లి మండలం రాయిగూడెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామాల్లో ఈ దర్బార్లు జరగనున్నాయి. ఉదయం 8:00 గంటల నుంచి రాయిగూడెం జడ్పీ హైస్కూల్లో, మధ్యాహ్నం 3:30 గంటల నుండి సుబ్లేడు జడ్పీ హైస్కూల్లో ఆయా పరిసర గ్రామాల ప్రజల కోసం ఈ వేదికలు సిద్ధమయ్యాయి. తన నియోజకవర్గంలో ఏ ఒక్క పౌరుడు సమస్యల కోసం రోజుల తరబడి తిరగకూడదనే లక్ష్యంతోనే ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించానని మంత్రి పొంగులేటి తెలిపారు.

