‘నా విజయానికి కారణం భాగ్యరాజ్’ : చిన్నికృష్ణ
ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ మరణం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సినీ జీవితంలో సాధించిన విజయాలకు గురువు భాగ్యరాజ్ శిష్యరికమే కారణమని ఆయన భావోద్వేగంగా తెలిపారు.
భారతీయ సినీ పరిశ్రమలో ఫ్లాప్ లేని రచయితగా తనను నిలబెట్టింది భాగ్యరాజ్ నేర్పిన కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలేనని చెప్పారు. తల్లిదండ్రుల కంటే గురువుకే ఎక్కువ గౌరవం ఇస్తానని, ఆయన ముందు కూర్చోవడానికి కూడా సంకోచిస్తానని పేర్కొన్నారు. తమిళనాడులో భాగ్యరాజ్‌కు ఎంతోమంది శిష్యులు ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల నుంచి తానే ఏకైక శిష్యుడినని చెప్పారు.
ప్రపంచంలో చార్లీ చాప్లిన్, భారతదేశంలో రాజ్‌కపూర్, దక్షిణ భారతంలో భాగ్యరాజ్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలులు అరుదని కొనియాడారు. భాగ్యరాజ్ మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై ప్రతిరోజూ గురువు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తానని చిన్నికృష్ణ తెలిపారు. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఆయన సేవలు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

