అరుణాచల్‌ప్రదేశ్‌లో జలప్రళయం
వరద బీభత్సం
అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలం
నీట మునిగిన గ్రామాలు.. కూలిన రహదారి
అసోంకు పొంచి ఉన్న ముప్పు.. హై అలర్ట్
అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం ఉదయం కురిసిన కుండపోత వర్షాలకు కేయీ పన్యోర్, లోయర్ సుబన్‌సిరి జిల్లాలు జల దిగ్భంధంలో చిక్కుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో పాటు ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. యాజలి, పోసా, యీయీ గ్రామాలను వరదలు ముంచెత్తాయి. పోసాలోని ఎన్‌ఈఈపీసీఓ కాలనీలో 15 నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రహదారులు బ్లాక్.. కొట్టుకుపోయిన వంతెన
తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగాయి. వరద ఉద్ధృతికి ఒక ప్రధాన రహదారి వంతెన కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం అందడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు.
మూడు గంటల్లోనే కుండపోత
యాజలి ప్రాంతంలో 72.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య కేవలం మూడు గంటల్లోనే కురిసిన కుండపోత వాన కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ఈ విపత్తు సంభవించింది. అధికారులు తక్షణమే స్పందించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అసోంకు పొంచి ఉన్న ముప్పు
అరుణాచల్‌ప్రదేశ్‌లో సంభవించిన ఈ జలప్రళయం వల్ల దిగువన ఉన్న అసోం రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనని కలవరం చెందుతున్నారు. వరద నేపథ్యంలో అసోం ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

