టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేలా టీటీడీకి భారీ విరాళాన్ని ప్రకటించారు.
రిలయన్స్ గ్రూప్ తరఫున టీటీడీకి 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు అనంత్ అంబానీ తెలిపారు. అంతేకాకుండా, ఆ బస్సుల నిర్వహణ వ్యయం, 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత విస్తరించేందుకు తిరుమలలో అవసరమైన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా రిలయన్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో తిరుమలలో పర్యావరణ రహిత రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది.
అదనంగా, గుజరాత్లోని రిలయన్స్ ప్రతిష్టాత్మక ‘వంతారా’ ప్రాజెక్టు తరహాలో తిరుమలలోని టీటీడీ గోశాలలను ఆధునికీకరించేందుకు కూడా సహకరించేందుకు అనంత్ అంబానీ అంగీకరించారు. ఈ కార్యక్రమాలు తిరుమలలో గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, గో సంరక్షణకు కీలకంగా మారనున్నాయని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.

