టార్గెట్లు కాదు.. పౌరుల భద్రతే ముఖ్యం
సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకులు వ్యాపార లక్ష్యాల కంటే పౌర భద్రతకే పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. 45 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి గురువారం సమావేశం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును మళ్లించేందుకు ఉపయోగించే ‘మ్యూల్ అకౌంట్ల’ నిర్మూలనే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
ఇటీవల ‘ఆపరేషన్ ఆక్టోపస్’లో భాగంగా కొందరు బ్యాంకు సిబ్బంది సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నట్లు తేలడంపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కొత్త ఖాతాలు తెరిచే టార్గెట్లపై కాకుండా, ‘జీరో మ్యూల్ అకౌంట్లు’ సాధించడమే బ్రాంచ్‌ల పనితీరుకు కొలమానం కావాలని సూచించారు. కంబోడియా, వియత్నాం వంటి దేశాల నుంచి పనిచేస్తున్న సైబర్ ముఠాలు భారతీయ మధ్యవర్తుల ద్వారా బ్యాంకు అధికారులతో కుమ్మక్కై నిధులను తరలిస్తున్నాయని, ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో బ్యాంకుల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు.మోసపూరిత ఖాతాలకు సహకరించే కేవైసీ వెరిఫైయర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని బ్యాంకింగ్ రంగం నుంచే బ్లాక్‌లిస్ట్ చేయాలని ఆదేశించారు. సైబర్ బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించి, వారికి జాతీయ హెల్ప్‌లైన్ 1930 గురించి అవగాహన కల్పించాలని కోరారు.

