Home Page SliderNewsNews AlertTelanganatelangana,

రైతుల విషయంలో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసిన పొంగులేటి

ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం వేదికగా రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని, అదే ఖమ్మంలో రైతులకు భరోసా కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు.

రాష్ట్ర ప్రజల మనోభావాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి విమర్శలను ప్రజలు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే వర్షాధార పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

గత పదేళ్ల పాలనలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తోందని మంత్రి విమర్శించారు. ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతుగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న జరగనున్న ‘రైతు ఆశీర్వాద సభ’కు భారీ సంఖ్యలో రైతులు, మహిళలు హాజరవుతారని తెలిపారు.