ఇరాన్‌పై అమెరికా తీవ్ర హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగియడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాపై దాడులు కొనసాగితే ఇరాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యలు చేపడతామని, ఆ పరిస్థితుల్లో “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్” అనే దేశమే ప్రపంచ పటంలో లేకుండా పోతుందని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
హర్మూజ్ జలసంధిలో ‘కికు’ అనే ముడి చమురు నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడం తాజా ఉద్రిక్తతలకు కారణమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలపై దాడులు నిర్వహించింది.
దీనికి ప్రతిగా ఇరాన్ విప్లవ బలగాలు కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి ప్రయత్నించాయి. అయితే ఆయా దేశాల రక్షణ వ్యవస్థలు వాటిని విజయవంతంగా అడ్డుకున్నాయి.
అమెరికా దాడులు కొనసాగితే యుద్ధ విరమణకు జరుగుతున్న దౌత్య చర్చలను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు, అంతర్జాతీయ చమురు రవాణాపై ఆందోళనలు మరింత పెరిగాయి.

