ఫస్ట్ వికెట్ డౌన్…. కాళేశ్వరం విచారణలో మొదటి అరెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలపై నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను ఏసీబీ అరెస్ట్ చేసి, 14 రోజుల రిమాండ్‌కు తరలించింది. మొత్తం 13 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ, హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో భారీ ఆస్తుల సమాచారాన్ని సేకరించింది. శ్రీధర్ ఆధ్వర్యంలో పనిచేసిన గాయత్రి పంప్‌హౌస్, రామడుగు పంప్‌హౌస్‌ల్లో కమీషన్ తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బ్యాంకు లాకర్లు తెరిపించేందుకు ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. మలక్‌పేటలో నాలుగంతస్తుల భవనం, షేక్‌పేట, తెల్లాపూర్, వరంగల్, కరీంనగర్‌లలో లగ్జరీ ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, వాణిజ్య సముదాయాలు, వ్యవసాయ భూములు, 19 ఇంటి స్థలాలు, హోటల్ వ్యాపారాల్లో భాగస్వామ్యం, రెండు కార్లు, బ్యాంకు డిపాజిట్లు, లాకర్లు తదితర విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ వెల్లడించారు. శ్రీధర్ కుమారుడి పెళ్లి వేడుకలు థాయ్‌లాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఘనంగా నిర్వహించడంతో, కోట్ల రూపాయల ఖర్చు నేపథ్యంలో ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. శ్రీధర్ ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజనీర్‌ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు ఏసీబీ ప్రకటించింది.