Home Page SliderInternationalNewsTrending Today

రోజుకు 80 గ్రాముల బంగారు ధూళి

ప్రకృతి సృష్టించే అద్భుతాల్లో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అంటార్కిటికాలోని చురుకైన మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారు ధూళిని వాతావరణంలోకి విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని విలువ ఏడాదికి సుమారు రూ.18.9 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రాస్ ద్వీపం సమీపంలోని ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడే వాయువులు బంగారు సూక్ష్మ కణాలను తమతో పాటు తీసుకెళ్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ కణాలు మంచుపై పడకముందే గాలి ప్రభావంతో దాదాపు 1,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయని తెలిపారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సాయంతో పరిశీలించగా, 60 మైక్రోమీటర్ల వరకు వ్యాసం కలిగిన స్వచ్ఛమైన బంగారు కణాలు ఉన్నట్లు నిర్ధారించారు.

అగ్నిపర్వత వాయువుల్లో బంగారం ఆనవాళ్లు కనిపించడం కొత్త విషయం కాకపోయినా, హవాయిలోని కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలాస్కాలోని ఆగస్టీన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ వంటి అగ్నిపర్వతాలతో పోలిస్తే, మౌంట్ ఎరెబస్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో నిరంతరంగా బంగారు ధూళి విడుదల కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.