రైతు సంక్షేమానికి పెద్దపీట: అచ్చెన్నాయుడు
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలంలో ఎద్దులతో అరక దున్ని కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, రైతుల ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం దెబ్బతిందని విమర్శించిన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తన కంపెనీల బకాయిలను చెల్లిస్తూ రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. 20 రోజుల్లోనే 15 లక్షలకు పైగా ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని, మూడు లక్షల మందికి పైగా కౌలు రైతులు లబ్ధి పొందారని వెల్లడించారు.
రైతులు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల మార్పిడి చేపట్టాలని, ఉద్యాన పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రసాయనాల అధిక వినియోగాన్ని తగ్గించాలని కోరారు. పొగాకు, తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం మద్దతు కొనసాగిస్తుందని, ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద తొలి విడత సాయం ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేసిన మంత్రి, అమరావతి రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

