BusinessHome Page SliderNationalNewsNews AlertTrending Today

జులై 1 నుంచి సామాన్యుడికి షాక్

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పాస్‌పోర్ట్ ఫీజులు, వాహనాల ధరలు, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఆధార్ సేవలు, ఎల్‌పీజీ ధరలు వంటి అనేక అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో ప్రజల నెలవారీ ఖర్చులు, ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్ ఫీజులను సవరించింది. సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరగగా, తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్స్, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి. టాటా ప్యాసింజర్ వాహనాల ధరలను 1.5 శాతం, కమర్షియల్ వాహనాలను 2.5 శాతం పెంచగా, కియా, బీఎండబ్ల్యూ సంస్థలు 2 శాతం, ఎంజీ మోటార్స్ 3 శాతం వరకు ధరలను పెంచనున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో కూడా మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్ కొన్ని క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్ల నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఉచిత దేశీయ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యం పొందాలంటే ప్రతి త్రైమాసికంలో కనీసం రూ.60 వేల ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక జులై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధరల సవరణ కూడా వెలువడనుంది. అలాగే ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత కఠినంగా అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ కావడంతో పన్ను చెల్లింపుదారులు ముందుగానే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అయితే ఆధార్ వినియోగదారులకు మాత్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్‌లో ఈ -మెయిల్ చిరునామా అప్‌డేట్‌ను ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో ఈ సేవకు రూ.75 రుసుము వసూలు చేసేవారు. తాజా నిర్ణయంతో ఆధార్ వివరాలను సులభంగా నవీకరించుకునే వీలుకానుంది.