Home Page SliderTelangana

ఖానాపూర్‌లో ఎవరి వ్యూహాలు వారివే?

బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించిన వారిలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఒకరు. గతంలో ఖానా‌పూర్ నుంచి రెండుసార్లు గెలిచిన రేఖా నాయక్‌ను కాదని బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రయోగం చేస్తోంది. ఇక్కడ్నుంచి, జాన్సన్ నాయక్ ను పార్టీ పోటీకి దించింది. గెలుపుపై దీమాతో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం కొత్త ప్రయోగం ఎంత వరకు సఫలమవుతుందన్నది చూడాల్సి ఉంది. ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి జాన్సన్ నాయక్ బరిలో దిగగా, కాంగ్రెస్ నుంచి వెడ్మ బొజ్జు, బీజేపీ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ బరిలో దిగారు. గతంలోలా పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ కూడా ముక్కోణపు పోటీ జరిగే అవకాశం కన్పిస్తోంది. హోరాహోరీ పోటీలో గెలిచేందుకు మూడు పార్టీల అభ్యర్థులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా పట్టిన గ్రహణాన్ని గెలుపు ద్వారా వదిలించుకోవాలని రాథోడ్ రమేష్ భావిస్తుంటే, కంచుకోటలో విజయం సాధించాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఉన్న పట్టును తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది.

ఖానాపూర్ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 305 పోలింగ్ బూత్‌లుండగా, పురుష ఓటర్లు 1,06,985, స్త్రీ ఓటర్లు 1,10,667 ట్రాన్స్‌జెండర్లు 13 మొత్తం ఓటర్లు 2,17,665 ఉన్నారు. జిల్లాలో విలక్షణ రాజకీయాలకు ఖానాపూర్ పెట్టింది పేరు. ఇక్కడ గోండ్లతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా గణనీయంగా ఉంది. మొత్తం ఓటర్లలో గోండ్లు 12 శాతంగా ఉంటే, ఇతర ఎస్సీలు పదకుండున్నర శాతం, ఇతర బీసీలు పదిన్నర శాతం, ఇతర ఎస్టీలు 9 శాతం వరకు ఉన్నారు. మున్నూరుకాపులు 8 శాతం ఉండగా, ముస్లింలు ఆరున్నర శాతం వరకు ఉన్నారు. లాంబాడ, మాదిగ, మాల ఓటర్లు ఐదేసి శాతం చొప్పున ఉన్నారు. బెస్త ఓటర్లు నాలుగు శాతం ఉండగా, మిగతా ఇతర వర్గాల ఓట్లున్నాయి.