NationalNews

సాహసాలకు పెట్టింది పేరు రెబల్ స్టార్ కృష్ణంరాజు

Share with

◆ ఉలిక్కిపడిన టాలీవుడ్
◆ తెలుగు సినీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కృష్ణంరాజు
◆ రాజకీయ వేత్తగా ప్రత్యేక గుర్తింపు
◆ అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన కృష్ణంరాజు

గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇక లేరు అనే వార్త సినీ ఇండస్ట్రీ తో పాటు ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సీనియర్ నటుడిగా రాజకీయవేత్తగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు ఈరోజు ఉదయం 3:25 గంటలకు ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జనవరి 20, 1940న జన్మించారు. 1966 లలో సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించిన కృష్ణంరాజు 183 తెలుగు సినిమాలలో నటించారు.

ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించారు.ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. సోమ‌వారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాన్ ఇండియా హీరోగా రాణిస్తోన్న ప్రభాస్‌కు కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారు.ఇప్పటికే ప్రభాస్ తండ్రి సూర్యం రాజు మరణించడంతో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారారు కృష్ణంరాజు. ఇక ప్రస్తుతం ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోయిందని పలువురు తమ బాధను తెలియజేస్తున్నారు..ఇక కృష్ణంరాజు మరణ వార్త విని అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పెదనాన్నను చూసుకోవడానికి ప్రభాస్ ఆసుపత్రికి చేరుకున్నారు. శనివారం అనారోగ్య సమస్యతో ఏ ఐ జి హాస్పిటల్ లో చేరిన కృష్ణంరాజు ఇలా తుది శ్వాస విడిచి విగతజీవిగా బయటకు రావడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి.. ప్రేక్షకులను బాగా మెప్పించిన కృష్ణంరాజు రాజకీయ నాయకుడిగా కూడా చెరగని గుర్తింపును సొంతం చేసుకున్నారు. కథానాయకుడిగా విలన్ గా నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

భారతీయ జనతా పార్టీ తరఫున 12వ లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణంరాజు చివరిసారిగా నటించిన సినిమా పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఇక ఈ సినిమా పెద్దగా హిట్టు కాకపోయినా కలెక్షన్ పరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.