విజయ్’ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం!
ఎన్నికల బరిలో తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించిన విజయ్, తన ఆర్థిక ప్రణాళికలోనూ అంతే క్రమశిక్షణతో ఉన్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయన సమర్పించిన ఆస్తుల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తి రూ. 624 కోట్లు కాగా…వాటిలో చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లుగా ఉన్నాయి. ఇంత ఆస్తి ఉన్నా అప్పులే లేకపోవడం విశేషం. వార్షిక ఆదాయం (2024-25)నికి గాను సినిమాలు, అద్దె, వడ్డీల రూపంలో రూ. 184.53 కోట్లు. చాలామంది రాజకీయ నాయకులు బినామీ పేర్లతో ఆస్తులు దాచుకుంటుంటే, విజయ్ మాత్రం తన సంపదలో మెజార్టీ వాటాను బ్యాంక్ ఖాతాల్లోనే ఉంచారు. ఒక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (సాలిగ్రామం బ్రాంచ్) సేవింగ్స్ ఖాతాలోనే రూ. 213.36 కోట్ల నగదు ఉండడం విశేషం. సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాదాపు రూ. 313 కోట్లు అంటే మొత్తం ఆస్తిలో సగం బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఇక విజయ్‌ని రియల్ ఎస్టేట్ కింగ్ అని చెప్పాల్సిందే. ఎంతో ముందుచూపుతో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేశారు. నీలంకరై, సాలిగ్రామం వంటి ప్రాంతాల్లో రూ. 115 కోట్ల విలువైన 10 నివాస స్థలాలు, రూ. 82.8 కోట్ల కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. అంతేకాక రూ. 13.52 కోట్ల విలువైన లెక్సస్, టాటా క్యారావాన్, బీఎండబ్ల్యూ i7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక బంగారం విషయానికి వస్తే విజయ్ పేరు మీద 833 గ్రాములు (రూ. 1.20 కోట్లు), ఆయన భార్య సంగీత పేరు మీద 3,132 గ్రాముల బంగారం ఉంది. అంతే కాక భార్య పేరు మీద రూ. 15.76 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే ఇంత సంపాదించిన విజయ్ స్టాక్ మార్కెట్ ను ఎక్కువ నమ్మలేదని తెలుస్తోంది. స్టాక్ మార్కెట్‌లో కేవలం రూ. 19.37 లక్షల విలువైన షేర్లు మాత్రమే ఉంచుకోవడం ఆశ్చర్యం. ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా, సొంతంగా భారీ నగదు నిల్వలు కలిగి ఉండటం వల్లే విజయ్ బలమైన పార్టీలను ఎదుర్కొని నిలబడగలిగారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

