వాళ్లకు వాళ్లే తిట్టుకొని సమయం వృధా చేస్తుండ్రు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై వాళ్లకు వాళ్లే తిట్టుకొని అసెంబ్లీలో సమయం వృధా చేస్తున్నారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.. పదేండ్ల వ్యవహారాలు చర్చకు రాకుండా బీఆర్ఎస్ భయపడుతుంటే, 15 నెలల సభ వైఫల్యాలు చర్చించకుండా కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందన్నారు. ‘‘వీరి తీరు చూస్తే సభ నడవకూడదు అనే ధోరణిలో ఉన్నారు. ఒకరికొకరు సహకారం చేసుకుంటూ సభ టైం వృధా చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి టైం గడిపేస్తున్నారు. కొత్త సభ్యులు నిరాశ పర్చే విధంగా సభ నడుస్తోంది. చర్చ పక్కదారి పట్టేలా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నారు. కొత్త సభ్యులకు స్పీకర్ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సభ జరగకూడదు అన్నట్టు రెండు పార్టీల వ్యవహారం ఉంది.” అని పాయల్ శంకర్ అన్నారు.