ఏరువాకతో కొత్త సాగుకు శ్రీకారం
తెలుగు రైతు జీవితంలో ఏరువాక పౌర్ణమి ప్రత్యేకమైన వ్యవసాయ పండుగగా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల్లో ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వర్షాకాలం ప్రారంభమై కొత్త సాగుకు శ్రీకారం చుట్టే సందర్భంగా రైతులు భూమాతకు, ప్రకృతికి, పశుసంపదకు కృతజ్ఞతలు తెలియజేస్తారు.
‘ఏరు’ అంటే నాగలి, ‘వాక’ అంటే ప్రారంభం. వ్యవసాయ పనులను నాగలితో ప్రారంభించే శుభదినాన్నే ఏరువాకగా భావిస్తారు. తొలకరి వర్షాల అనంతరం నేల సాగుకు అనుకూలంగా మారిన సమయంలో రైతులు ఈ పండుగను జరుపుకుని, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థిస్తారు.
ఈ సందర్భంగా కాడెద్దులకు స్నానం చేయించి, రంగులు, పూలమాలలు, గంటలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి పొలంలో తొలి నాగలి సాలు వేస్తారు. సాయంత్రం గ్రామాల్లో ఎద్దుల ఊరేగింపులు, జానపద కళారూపాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఏరువాక పండుగలో పశువుల ఆరోగ్య సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఆయుర్వేద మందులు అందించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. యాంత్రిక వ్యవసాయం విస్తరించినా, రైతు జీవితంలో ప్రకృతి పట్ల కృతజ్ఞత, భూమాతపై భక్తి, పశుసంపదపై ప్రేమను చాటిచెప్పే పండుగగా ఏరువాక నేటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.
-వెంకటేశ్వర్లు బోయ

