కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు…కాంగ్రెస్ రిబ్బన్లు కట్ చేస్తోంది
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి నిర్మించిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకోవాలని చూడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే పూర్తయిన చనాకా-కొరటా, సదర్ మాట్ బ్యారేజీలకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రిబ్బన్ కట్ చేస్తూ గొప్పలు చెప్పుకోవడం ఆయన అల్పబుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క కొత్త ఇటుక వేయలేదని, ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.కేసీఆర్ చేసిన పనులకు రంగులు పూసి తమవిగా ప్రచారం చేసుకోవడం దగుల్భాజీతనమని ధ్వజమెత్తారు. రాష్ట్రంపై రెండున్నర లక్షల కోట్ల అప్పులు మోపిన రేవంత్ రెడ్డి, ఆ నిధులతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేయించడం మానుకోవాలని, పరిపాలన అంటే శిలాఫలకాలపై పేర్లు చెక్కించుకోవడం కాదు, ప్రజల మనసుల్లో ముద్ర వేయడమని హరీశ్ రావు హితవు పలికారు.

