100 విమానాశ్రయాలు.. కేంద్రం ప్లాన్
ప్రాంతీయ విమాన ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ‘ఉడాన్’ (UDAN) పథకాన్ని మరో పదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి వర్క్‌షాప్‌లో మాట్లాడిన మంత్రి, రాబోయే దశాబ్దంలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. దీంతో చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సౌకర్యాలు మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు.
ఉడాన్ పథకంలో భాగంగా అమలు చేస్తున్న ‘వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)’ నిబంధనల్లో కూడా కేంద్రం మార్పులు చేసింది. గతంలో వారానికి ఏడు కంటే తక్కువ విమాన సర్వీసులు ఉన్న విమానాశ్రయాలను మాత్రమే ‘అండర్‌సర్వ్‌డ్’గా పరిగణించేవారని, ఇప్పుడు ఆ పరిమితిని వారానికి 14 లేదా అంతకంటే తక్కువ సర్వీసులు ఉన్న విమానాశ్రయాల వరకు విస్తరించినట్లు వివరించారు.
ఈ మార్పులతో మరిన్ని ప్రాంతీయ విమానాశ్రయాలు కేంద్ర ఆర్థిక సహాయానికి అర్హత పొందనున్నాయి. అలాగే కొత్త రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించేందుకు విమానయాన సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుందని, దీంతో దేశంలో ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

