కాకినాడలో పవన్ కళ్యాణ్..కీలక వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటిస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడ పోర్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఇటీవల పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని కలెక్టర్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనిఖీల కోసం పవన్ కళ్యాణ్ నౌకలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇలాంటివి గుర్తించి, పట్టించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సరిగ్గా ఉంటే పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? మనం పోరాడింది దీనికోసమేనా? అంటూ మండిపడ్డారు. పోర్టు అధికారుల పేర్లను నమోదు చేయాలని ఆదేశించారు. ఈ పోర్టు నుండి గత ప్రభుత్వ హయాం నుండి అక్రమ రవాణా కొనసాగుతోందని, జవాబుదారీతనం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు.