ఇస్కాన్ సన్యాసిని వెంటనే విడుదల చేయాలి
. 500 రోజులుగా జైలులో ఉంచడంపై ఆగ్రహం..
. మౌనం వీడాలని మేధావులకు పిలుపు
. మైనారిటీల హక్కుల కోసం మాట్లాడటం నేరమా?
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును సుదీర్ఘకాలంగా జైలులో నిర్బంధించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. 500 రోజులకు పైగా ఆయనకు బెయిల్ నిరాకరించడాన్ని తప్పుబట్టిన పవన్, వెంటనే ఆయనను విడుదల చేసి తగిన వైద్య సహాయం అందించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ సమాజం , మానవ హక్కుల కార్యకర్తల మౌనాన్ని నిలదీశారు. చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. “పదేపదే బెయిల్ నిరాకరించడమే కాకుండా, ఆయన తరఫున వాదించే న్యాయవాదులను కూడా కోర్టు హాలులో బెదిరిస్తుంటే ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది? మైనారిటీ హిందూ సమాజం హక్కుల కోసం పోరాడటం నేరమా?” అని ఆయన ప్రశ్నించారు. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ఆధ్యాత్మిక గురువును నేరస్థుడిలా చూస్తూ, ఆయన గొంతు నొక్కుతుంటే ప్రపంచం మౌనంగా ఉండకూడదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. కొన్ని ప్రత్యేక అంశాలపై మాత్రమే స్పందించే ‘సెలెక్టివ్’ మానవ హక్కుల కార్యకర్తలు, నకిలీ సెక్యులరిస్టుల తీరును పవన్ కల్యాణ్ ఎండగట్టారు. “ప్రపంచంలో ఎక్కడ చిన్న సంఘటన జరిగినా రాత్రికి రాత్రే హ్యాష్‌ట్యాగ్‌లతో స్పందించే వారు.. ఒక ఆధ్యాత్మిక గురువు విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? వారి మానవత్వానికి కూడా ఫిల్టర్ ఉందా?” అని ఘాటుగా విమర్శించారు. బాధిత సన్యాసికి వెంటనే న్యాయపరమైన రక్షణ కల్పించాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అణచివేతలను ప్రస్తావిస్తూ.. చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు విడుదల కోసం అంతర్జాతీయ సమాజం గొంతు ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కల్యాణ్ అన్నారు. కేవలం మైనారిటీల తరఫున మాట్లాడారనే కారణంతో ఒక వ్యక్తిని ఇన్ని రోజులు జైలులో ఉంచడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు.

