యూపీఐపై కొత్త ఛార్జీలు?
దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశాలపై చర్చ జోరుగా సాగుతోంది. యూపీఐ ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై 0.5 శాతం కంటే తక్కువ ఎండీఆర్‌ను అమలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో వ్యాపారులు, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉండటంతో దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులు వేగంగా పెరిగాయి. అయితే ఎండీఆర్ అమలైతే, ఆ ఛార్జీల భారం ముందుగా వ్యాపారులపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చిన్న వ్యాపారుల లాభాలు తగ్గడంతో పాటు, ఆ అదనపు ఖర్చును వస్తువుల ధరల రూపంలో వినియోగదారులపై మోపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, ఇతర ప్రమోషనల్ ఆఫర్లు తగ్గే అవకాశమూ ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా టీ దుకాణాలు, చిన్న కిరాణా వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే యూపీఐపై ఎండీఆర్ అమలుకు సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు భంగం కలగకుండా, వ్యాపారులు, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

