“తెలంగాణాలో ఆదాయం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి”: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణా సచివాలయంలో దాదాపు 4గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలను గురించి చర్చించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో సీఎం రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సీఎం హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను తయారు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. ఆదాయం తెచ్చి పెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపైన అధికారులు నిక్కచ్చిగా ఉండాలని సీఎం ఆదేశించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునరవ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. నెలవారీ సమీక్షతో పాటు ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు.ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీ ఆదాయం పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలన్నారు. పెట్రోలు, డీజిల్ పై వాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు.

