Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

జగన్‌ను టార్గెట్ చేసిన అనిత

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ పేరులోని “గన్” రాజధాని పేరులో కూడా ఉండాలనే ఉద్దేశంతోనే “మావిగన్” పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనే కుట్రతోనే జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాజధాని అంశంలో వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, అధికారంలోకి రాకముందు అమరావతికి మద్దతిచ్చి, తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని, ఇప్పుడు “మావిగన్” పేరుతో కొత్త చర్చ మొదలుపెట్టారని విమర్శించారు. ఇలా ప్రతిసారి వైఖరి మార్చడం ద్వారా రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకుండా చేయడమే జగన్ లక్ష్యమని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో “మావిగన్” ప్రతిపాదనను చేర్చాలని జగన్ భావిస్తున్నారని, గత ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పు ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలు, వైఖరి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు.

అదే సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను కూడా అనిత ఖండించారు. మహిళా కమిషన్ విచారణకు హాజరైన తర్వాత కూడా ఆయన తీరు మారలేదని, వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి అంశంపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు.