BusinessHome Page SliderInternational

మైక్రోసాఫ్ట్ అదిరిపోయే పదవీ విరమణ ఆఫర్ !

కృత్రిమ మేధ (AI)పై పెట్టుబడులు పెంచుతున్న తరుణంలో, అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చరిత్రలో మొదటిసారిగా ఉద్యోగుల కోసం ‘స్వచ్ఛంద పదవీ విరమణ’ అవకాశాన్ని కల్పించింది. ఉద్యోగి వయసు, కంపెనీలో చేసిన సర్వీసు కలిపి 70 ఏళ్లు దాటిన వారు ఈ ఆఫర్‌కు అర్హులు (ఉదాహరణకు: 50 ఏళ్ల వయసు + 20 ఏళ్ల సర్వీసు). ఈ పథకాన్ని ఎంచుకునే వారికి నగదు చెల్లింపులతో పాటు, ఐదేళ్ల వరకు హెల్త్‌కేర్ కవరేజీ, స్టాక్ ప్రయోజనాలు కల్పించనున్నారు. అంతేకాక..ఏకమొత్తంలో స్వచ్ఛంద పదవీ విరమణ భత్యాన్ని ఇస్తోంది. ఉద్యోగులు నెల రోజుల లోపు తమ సమ్మతిని తెలియజేయాలని సూచించింది. సుమారు 8,750 మంది ఉద్యోగులు ఈ పథకం కింద విరమణ పొందే అవకాశం ఉందని అంచనా. దీని కోసం కంపెనీ 900 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 7,500 కోట్లు) కేటాయించింది. ఏఐ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం, సంస్థాగత నిర్మాణాన్ని పునర్నిర్మించడమే లక్ష్యమని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని లే ఆఫ్స్ కూడా ఉండవచ్చని మైక్రోసాఫ్ట్ సంకేతాలిచ్చింది. రానున్న నెలల్లో కొత్త నియామకాలను తగ్గించి, పొదుపు చర్యలపై మైక్రోసాఫ్ట్ మరింత దృష్టి సారించనుంది.