జగన్‌కు ఝలక్ ఇచ్చిన నమ్మకస్తులు, పార్లమెంట్‌లో సీన్ చేంజ్ కానుందా?
ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా
టీడీపీలో చేరేందుకు సిద్ధం
ఏపీలో జగన్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ
రాజ్యసభలో తగ్గనున్న వైసీపీ బలం
11 నుంచి 9కి తగ్గనున్న సభ్యులు
ఏపీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీకి, తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇద్దరు సభ్యులు రాజీనామాలను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంకర్ ఆమోదించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. ఇద్దరు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభలో వెంకటరమణ పదవీకాలం జూన్ 2026 వరకు ఉండగా, బీదా మస్తాన్ రావు, పదవీకాలం జూన్ 2028 వరకు ఉంది. ఇద్దరూ టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఇద్దరు నేతలు ఇటీవల టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును కలిశారు.
ఇద్దరు పార్టీ మారడంతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 9కి తగ్గనుంది. వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీల బలం ఉంది. రాజీనామా చేసిన ఇద్దరు ఎంపీలు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 2019 నుంచి రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేరు. బీద మస్తాన్ రావు గతంలో టీడీపీలో కూడా పనిచేశారు. 2009-2014 వరకు ఆంధ్రాలోని కావలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో YSRCPలో చేరారు. మరోవైపు వెంకటరమణ కాంగ్రెస్‌లో ఉన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఎన్నికలలో ఎదురుదెబ్బ తర్వాత, నేతల వలసలకు చెక్ పెట్టేందుకు కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇది పెద్ద దెబ్బ. తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇంకా ఎందరు నేతలు పార్టీ వీడతారన్నదానిపై క్లారిటీ మిస్సవుతోంది. వచ్చే రోజుల్లో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతల వలసలు ఖాయంగా కన్పిస్తోంది. మొత్తంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు బీజేపీకి శుభవార్తగా చెప్పాల్సి ఉంటుంది. NDA ఇటీవల ఎగువ సభలో మెజారిటీ మార్కును దాటింది. కీలకమైన చట్టాలను ఆమోదించేందుకు సహాయపడుతుంది. ఇద్దరు ఎంపీలు టీడీపీ ఖాతాలోకి వెళ్తే అప్పుడు ఎన్డీయే సంఖ్య మరింత పెరుగుతుంది.