జనసేన మహిళా నేత అరెస్ట్
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి వినూత కోటా, భర్త చంద్రబాబు ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. చేతి మీద జనసేన సింబల్తో పాటు వినుత పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు పోలీసులు విచారించారు. ఆపై అది ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) కొంతకాలంగా వినూత కోటా దగ్గర డ్రైవర్ గా పని చేశాడు. అతనిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేపర్లో.. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన రాయడిని హత్య చేసి నదిలో పడేసినట్లు తెలుస్తోంది. దీంతో వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మిగతా నిందితులను కాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

