విశ్వరహస్యాలముడి విప్పుతున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ -మిస్టరీ గెలాక్సీ కార్ట్ వీల్
మానవుడు బుద్దిజీవిగా మారినప్పడి నుండీ ఆ నింగి రహస్యాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కనిపెడుతున్నకొద్దీ విశ్వరహస్యాలు అంతుచిక్కని ఆశ్చర్యానికి మనిషిని గురిచేస్తూనే ఉన్నాయి. అనంతమైన ఈ విశ్వంలో మనిషి ఉనికి ఆవగింజంత. అయినా తెలుసుకోవాలే తపన మనిషిని నిలువనీయక అంతరిక్షప్రయాణానికి పురిగొల్పింది. భూమికి ఎన్నో కోట్ల కాంతిసంవత్సరాల దూరాలలో ఉన్న ఎన్నో గెలాక్సీలను టెలిస్కోప్ సహాయంతో కనిపెట్టారు. అయితే ఈ జాబితాలో ఇంతకాలం అందకుండా తప్పించుకుంటున్న ఒక మిస్టరీ గెలాక్సీ జాడ ఇన్నాళ్లకు చిక్కింది. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కార్ట్ వీల్ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎట్టకేలకు వెబ్ కెమెరాలో బంధించింది. ఈ గెలాక్సీ చుట్టూ నిత్యం నక్షత్ర ధూళి భారీ ఎత్తున ఆవరించి ఉండడం వల్ల ప్రసిద్ది పొందిన హబుల్ టెలిస్కోప్ వంటి టెలిస్కోప్‌లు కూడా దానిని ఫొటోలు తీయలేకపోయాయి.

ఇప్పుడు జేమ్స్ వెబ్ తీసిన ఈ కార్ట్ వీల్ గెలాక్సీ కి చెందిన ఇన్‌ఫ్రారెడ్ చిత్రాలద్వారా గత కోట్లాది సంవత్సరాలలో ఈగెలాక్సీ ఎలాంటి మార్పులకు లోనయ్యిందో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. దాని కేంద్రస్థానం వద్ద ఉన్న బ్లాక్ హోల్ గురించి కూడా విలువైన సమాచారం దొరికే వీలు ఉందని తెలుస్తోంది. అంతేకాక నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన, మనకు తెలియని చాలా విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్ట్ వీల్ గెలాక్సీచుట్టూ రెండు కాంతి మండలాలున్నాయి. కేంద్రస్థానంలో సంభవించిన మహా విస్ఫోటం వల్ల చెరువులో అలల్లా ఇవి విస్తరిస్తూ పోతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది రింగ్ ఆకారంలో ఉండడం వల్ల దీనిని రింగ్ గెలాక్సీ అని కూడా అంటారు. ఈ ఫోటోల్లో అచ్చం బండిచక్రం మాదిరిగానే ఇది కనిపిస్తోంది. స్కల్ప్టర్ నక్షత్ర మండలంలోని ఈ గెలాక్సీతో పాటు మరెన్నో ఇతర గెలాక్సీలు కూడా దీనిలో కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక పెద్ద, మరియు బుల్లి గెలాక్సీల ఢీకొట్టడం వల్ల ఈ కార్ట్ వీల్ గెలాక్సీ ఏర్పడిందని సైంటిస్టులు సిద్దాంతీకరించారు. అంతరిక్ష ధూళి కారణంగా దీనిని హబుల్ టెలిస్కోప్ కనిపెట్టలేక పోయింది. అయితే హబుల్‌కి వారసునిగా అంతరిక్షంలో ప్రవేశపెట్టబడిన జేమ్స్ వెబ్ ఇటీవలే అంతరిక్ష ప్రవేశం చేసింది. కాలంలో వెనక్కు చూడగల ఇన్ ఫ్రారెడ్ సామర్థ్యం దీనికి ఉంది. విశ్వం తొలినాళ్లకు సంబంధించిన ఫొటోను ఇటీవలే మనకు అందించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ కార్ట్ వీల్ గెలాక్సీకి సంబంధించిన భూత, వర్తమాన, భవిష్యత్ చిత్రాలను కూడా స్పష్టంగా అందిచగలగడం ఎంతో విశేషం అనే చెప్పాలి. నాసా సైంటిస్టులు ఈ మిడ్ ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్ (MIRI) సహాయంతో విశ్లేషిస్తున్నారు. దీనితో మనకు మరిన్ని విశ్వరహస్యాలు తెలుస్తాయని ఆశిద్దాం.

