హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్
హైదరాబాద్‌ను కేవలం ఒక నగరంలా కాకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆధునీకరణ ప్రక్రియలో సాంకేతికతను జోడించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ, భవిష్యత్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా తగ్గించేందుకు ప్రభుత్వం ‘త్రీ లెవెల్ ట్రాన్స్‌పోర్ట్ మోడల్’ (అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్) అమలు చేయాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సరికొత్త విధానం ప్రకారం.. భూమి అడుగున అండర్‌పాస్‌లు, నేల పైన సాధారణ రహదారులు, ఆ పైభాగంలో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడం ద్వారా వాహనాల రాకపోకలను మూడు పొరలుగా విభజించవచ్చు. దీనివల్ల సిగ్నళ్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గడమే కాకుండా, నగరంలో ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. హైదరాబాద్‌ను పూర్తిస్థాయి ‘సిగ్నల్ ఫ్రీ సిటీ’గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను సిద్ధం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

