బండి బగీరథ్ పై పోక్సో కేసు విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణలో రాజకీయంగా, పరిపాలనాపరంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించి డీజీపీ సీవీ ఆనంద్‌ను వివరణ కోరారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, నిందితుడిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్ల వల్ల సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ వివరించగా, ఈ సాకులు సరికాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మరోవైపు ఈ ఉదంతంపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా సీరియస్‌గా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి పోలీస్ కమిషనర్ నుంచి పూర్తి వివరాలను సేకరించి, కేసు విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలికను వేధిస్తున్నారన్న తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇదే సమయంలో సదరు బాలిక కుటుంబం తనను డబ్బుల కోసం బెదిరిస్తోందని భగీరథ్ కరీంనగర్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కూడా కేసు నమోదు చేశారు. అధికార యంత్రాంగం వేగంగా స్పందించాలని సీఎం ఆదేశించడంతో ఈ కేసు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

