వినేష్ ఫోగాట్‌కి భారీ షాక్!
భారత సీనియర్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ రింగ్ లోకి తిరిగి రావాలనుకుంటున్న తరుణంలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెలాఖరులో జరగనున్న 2026 ఆసియా క్రీడల ఎంపిక పోటీలకు సంబంధించి భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) విడుదల చేసిన కొత్త నిబంధనలు ఆమెకు అడ్డంకిగా మారాయి. 2025 జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్, 2026 సీనియర్ ఫెడరేషన్ కప్ లేదా అండర్-20 జాతీయ టోర్నీల్లో పతకాలు సాధించిన వారు మాత్రమే ఎంపిక పోటీలకు అర్హులని WFI పేర్కొంది. వినేష్ 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎటువంటి పోటీల్లో పాల్గొనకపోవడంతో ఆమెకు అవకాశం లేకుండా పోయింది. గతేడాది బిడ్డకు జన్మనివ్వడం వల్ల వినేష్ ఆటకు దూరంగా ఉన్నారు. తిరిగి ఫామ్ అందుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో ఆమె పాల్గొననున్నారు. వాడా (WADA) నిబంధనలు రిటైర్ అయిన అథ్లెట్లు తిరిగి రావాలంటే 6 నెలల ముందే డోపింగ్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇవ్వాలి. వినేష్ ఈ ప్రక్రియను పూర్తి చేశారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. మాజీ WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై గతంలో నిరసన తెలిపిన వినేష్, ఆయన ఇలాకా అయిన గోండాలో పోటీలు నిర్వహించడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఆసియా క్రీడల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాలనే వినేష్ లక్ష్యం నెరవేరాలంటే, సమాఖ్య నిబంధనల్లో ఏవైనా మార్పులు జరుగుతాయా లేదా అనేది వేచి చూడాలి.

