Andhra PradeshHome Page Slider

పింఛన్లు పంపిణీపై సీఎస్ చాంబర్ ముందు బైఠాయించిన కూటమి నేతలు

Share with

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో పింఛన్ల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటర్లను తప్పించాలంటూ ఏపీ ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ లేఖతో, ఈసీ నిర్ణయం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఎన్నికలకు ముందు పింఛన్లు సచివాలయాలకు వచ్చి తీసుకునేలా చేయడం ద్వారా, అది కూటమికి ఇబ్బంది కలిగిస్తుందేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఈసారి రాకుండా చూడాలని, పింఛన్లను ఇళ్ల వద్దకు వెళ్లే ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈసారి పింఛన్ల విషయంలో సీఎస్ వైఖరిపై ఎన్డీయే కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా సచివాలయంలో మొదటి బ్లాక్ మెట్ల వద్ద నేతలు ఆందోళనకు దిగారు.

సీఎం జగన్, సీఎస్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మే నెల పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం సీఎస్‌కు లేఖ రాసిన తరుణంలో, ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచేలా చేయాలని వారు కోరారు. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందితోపాటుగా, ప్రభుత్వ సిబ్బందిని పింఛన్ల పంపిణీకి వినియోగించాలని వారు సూచించారు. దీనిపై సీఎస్ నుంచి స్పష్టత లభించకపోవడంతో, వారు అక్కడే బైఠాయించి నిరనస తెలిపారు. గతంలో ప్రభుత్వపెద్దలు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత వర్లా రామయ్య ఆరోపించారు. వచ్చే నెలలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఒక్కరు చనిపోయినా అందుకు సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యత వహించాల్సిందేనని వారు తేల్చి చెప్పారు.