Home Page SliderNews

కాంగ్రెస్‌కు గుడ్ బై.. బీజేపీకి వెల్కమ్… మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Share with

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా పత్రాన్ని పంపారు. దీంతో రాష్ట్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ మరో నాయకుని దూరం చేసుకున్నట్లయింది. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పార్టీ పెద్దలతో కూడా కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపినట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుమారు మూడున్నర సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరితే జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన పదవిని కట్టబెట్టే యేచనలో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఏడాది కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ జాతీయస్థాయి సమావేశానికి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కావటం పార్టీ పెద్దలతో కలిసి సదస్సులో పాల్గొనడంతో అప్పట్లో ఆ ప్రచారానికి తెరపడింది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటినుండే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను ఆయన సేవలను ఉపయోగించుకొని పార్టీని మరింత బలవపేతం చేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.