యువత కలల భారతదేశం: దాడులు కాదు, సమాధానాలు కావాలి
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన ఒక ఘటన దేశ రాజకీయ, సామాజిక వాస్తవాలపై మరోసారి చర్చకు దారితీసింది. షహీద్ స్మారక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కొందరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారు. కార్యక్రమానికి చేరుకున్న దీప్కేపై జనసమూహంలో ఉన్న వ్యక్తి వరుసగా చెంపదెబ్బలు కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత పార్టీ కార్యకర్తలు జోక్యం చేసుకోవడంతో తోపులాట చోటుచేసుకోగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన అభిజీత్ దీప్కే, “భౌతిక దాడులు భయం, పిరికితనానికి సంకేతం. శాంతియుతంగా మా గొంతును వినిపిస్తూనే ఉంటాం. నేను గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తాను. శాంతి, ప్రేమతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను” అని పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీజేపీ నిర్వహించిన ఈ నిరసన కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు. పరీక్షల అవకతవకలు, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, అవినీతి, అవకాశాల అసమానత వంటి అంశాలపై పెరుగుతున్న యువత ఆవేదనకు ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది.
భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తోంది. భారీ ప్రాజెక్టులు, ఆధునిక నగరాలు, డిజిటల్ విప్లవం, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. అయితే ఈ అభివృద్ధి మధ్య ఒక సాధారణ యువకుడి మనసులో ప్రశ్నలు మాత్రం తగ్గడం లేదు. దేశ సంపద నిజంగా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతోందా? లేక కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందా? ఒక రైతు పంట కోసం అప్పులు చేస్తాడు. ఒక మధ్యతరగతి కుటుంబం పిల్లల విద్య కోసం రుణాలు తీసుకుంటుంది. ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి కష్టపడతాడు. కానీ మరోవైపు భారీ ఆర్థిక కుంభకోణాలు, బ్యాంకు రుణాల ఎగవేతలు, అవినీతి ఆరోపణలు, నాసిరకం ప్రజా పనుల వార్తలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలలో వ్యవస్థపై అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా యువతలో అసంతృప్తి మరింత బలపడుతోంది. అత్యున్నత విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా ఉద్యోగ భద్రత లేకపోవడం, నియామకాలలో పారదర్శకతపై సందేహాలు, పరీక్షా పత్రాల లీకేజీలు, అవినీతి ఆరోపణలు యువత నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. కష్టపడి చదివిన వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయనే భావన విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వంటి వేదికలు యువత అసంతృప్తికి రాజకీయ స్వరంగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. దేశ సంపద అందరికీ సమాన అవకాశాల రూపంలో చేరాలని, విద్య, ఉపాధి వ్యవస్థల్లో న్యాయం ఉండాలని, ప్రజా ధనం ప్రజల సంక్షేమానికే వినియోగించబడాలని ఇవి కోరుతున్నాయి.
నేటి జెన్-జీ యువత పాత తరాల కంటే భిన్నంగా ఆలోచిస్తోంది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, స్వతంత్ర సమాచార వనరుల ద్వారా ప్రపంచాన్ని గమనిస్తోంది. వారు కేవలం ఉద్యోగాలను మాత్రమే కాదు; పారదర్శకత, జవాబుదారీతనం, సమానత్వం, న్యాయం కూడా కోరుతున్నారు. “ఎందుకు?” అనే ప్రశ్నను అధికారంలో ఉన్న వారిని కూడా అడగగల ధైర్యం వారికి ఉంది. అయితే అసంతృప్తి ఒక్కటే పరిష్కారం కాదు. దేశ భవిష్యత్తు కోసం నిర్మాణాత్మక మార్పులు అవసరం. విద్యా వ్యవస్థను ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చాలి. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. నియామక వ్యవస్థలో పూర్తి పారదర్శకత ఉండాలి. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల ప్రకటన వరకు జవాబుదారీతనం పెరగాలి. అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజా ధనం ఎక్కడ ఖర్చవుతోందో ప్రజలకు స్పష్టంగా తెలియాలి. అలాగే యువ పారిశ్రామికవేత్తలకు సులభ రుణాలు, సాంకేతిక సహాయం, మార్గదర్శకత్వం అందించాలి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతను ఉద్యోగాలు సృష్టించే దిశగా ప్రోత్సహించాలి. స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచనలకు ప్రభుత్వం మరియు సమాజం మరింత మద్దతు ఇవ్వాలి. జైపూర్‌లో జరిగిన దాడి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన చోట భౌతిక దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. భిన్నాభిప్రాయాలను హింసతో అణచివేయడం కంటే చర్చల ద్వారా, వాస్తవాల ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవడం అవసరం.
దేశ సంపదపై ప్రశ్నలు అడగడం తప్పు కాదు. సమాన అవకాశాల కోసం పోరాడడం కూడా తప్పు కాదు. కానీ ఆ పోరాటం వాస్తవాల ఆధారంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సాగాలి. యువతలో ఉన్న ఆవేశం, ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, మార్పు కోసం ఉన్న తపన సరైన దిశలో ప్రయాణిస్తే భారతదేశం మరింత న్యాయబద్ధమైన, పారదర్శకమైన, అవకాశాలు అందరికీ అందే సమాజంగా మారగలదు. అదే నిజమైన అభివృద్ధి. అదే యువత కలల భారతదేశం.
-వెంకటేశ్వర్లు బోయ

