NationalNewsNews Alert

ఆదిపురుష్ చిత్రబృందానికి ఢిల్లీ కోర్టు నోటీసులు

ఆదిపురుష్ చిత్రబృందానికి ఢిల్లీ కోర్టు చురకలు వేసింది. ప్రభాస్‌తో సహా ప్రధాన పాత్రదారులకు, దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రధాన అంశం రామాయణం. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇటీవలే విడుదలైంది. అప్పటి నుండి అనేక మంది దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మండిపడ్డాయి. సూపర్ హిట్ సీరియల్ ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేష్ ఖన్నా కూడా ఈ టీజర్‌ను విమర్శించాడు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ ఒక సంస్థ దిల్లీ హైకోర్టుకెక్కింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని పిటిషన్ వేసింది. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ఆదిపురుష్ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది.

ఈ సినిమాలో శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడు పాత్రలను చూపించిన విధానం సరిగ్గాలేదని, రామాయణాన్ని వక్రీకరిస్తున్నారని పలు సంఘాలు విమర్శిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ గురించే ట్రోల్స్ వస్తున్నాయి. ప్రభాస్‌కు కూడా కోర్టు నోటీసులు అందాయి. రామాయణం గురించి సరైన  అవగాహన లేకుండానే ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.