పాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు సాగుతుంటే.. పాకిస్థాన్ మాత్రం చొరబాట్లు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే మార్గాలను వెతుకుతోందని అన్నారు. భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తుంటే, పాక్ ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేస్తోందని విమర్శించారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, 1999 కార్గిల్ విజయాన్ని భారతమాత కిరీటంలోని వజ్రంగా అభివర్ణించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అవి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంపైనే ఉంటాయని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంలో భాగంగా మార్చుకుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత్‌ను బెదిరించే ప్రయత్నాలకు భారత సైన్యం గట్టి సమాధానం ఇస్తుందని చెప్పారు. ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం ఘటన అనంతరం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఆయన ప్రస్తావించారు.
కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు పలువురు సైనిక అధికారులు పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పించారు.

