పెద్ద భవనాలకు కొత్త గైడ్‌లైన్స్
దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, వాతావరణ మార్పుల సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భారీ భవనాలకు కొత్త ఇంధన సామర్థ్య (ఎనర్జీ ఎఫిషియెన్సీ) నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ గైడ్‌లైన్స్‌ను రూపొందించింది.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో రూపొందిన ఈ నిబంధనలు 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ బిల్ట్-అప్ ఏరియా కలిగిన కొత్త వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయ భవనాలకు వర్తిస్తాయి. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ తర్వాత ప్రారంభమయ్యే కొత్త ప్రాజెక్టులకే ఇవి అమల్లోకి వస్తాయి.
బీఈఈ నిర్దేశించిన ఇంధన సామర్థ్య ప్రమాణాల ఆధారంగా గ్రిహ, ఐజీబీసీ వంటి రేటింగ్ సంస్థలు భవనాలకు ఎనర్జీ రేటింగ్‌లు కేటాయించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం దేశ విద్యుత్ వినియోగంలో దాదాపు మూడో వంతు భవనాల రంగానికే వెచ్చిస్తుండగా, రాబోయే దశాబ్దంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. కొత్త నిబంధనలతో ఇంధన వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు కార్బన్ ఉద్గారాలు తగ్గి, దేశ ఇంధన భద్రత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

