ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఆరోగ్య పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ పథకాన్ని ప్రారంభించి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 886 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తిగా క్యాష్‌లెస్ వైద్యం అందుబాటులో ఉంటుంది. మొత్తం 1,816 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు ఇందులో చేర్చడంతో వైద్య ఖర్చుల భారం తగ్గనుంది.
ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు ప్రత్యేక హెల్త్ ఐడీ జారీ చేయడంతో పాటు, వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 24 వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, వారి ఆరోగ్య భద్రత కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ పథకం కీలకంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

