రైతులపై కక్ష సాధింపు: అంబటి
తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపై రౌడీయిజం చేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులపై పోలీసులు, బుల్డోజర్లను ప్రయోగించడం దుర్మార్గమని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించని రైతులను భయపెట్టి, బలవంతంగా భూములు లాక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ, అధికారులు కోర్టు ప్రక్రియను పట్టించుకోకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికే సుమారు 2.75 ఎకరాల్లో సాగులో ఉన్న పంటలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారని, పూలింగ్‌కు ఒప్పుకోలేదనే కారణంతో రైతుల పంటలను నాశనం చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
మార్కెట్లో దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే భూమికి ప్రభుత్వం కేవలం రూ.2.47 కోట్ల పరిహారం ప్రకటించడం రైతులకు తీవ్ర అన్యాయమని అంబటి రాంబాబు విమర్శించారు. కూటమి నేత సీఎం రమేష్ ఒక్కో ఎకరాన్ని రూ.5 కోట్లకు కొనుగోలు చేశారని గుర్తుచేస్తూ, సాధారణ రైతులకు మాత్రం తక్కువ పరిహారం ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రైతులను నష్టపరిచి భూములను కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నమే జరుగుతోందని ఆరోపించారు.
సీఆర్డీఏ అధికారులు కూడా బ్రోకర్లలా వ్యవహరిస్తూ రైతులను భయపెట్టి భూములు అమ్మించేందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను బలవంతంగా భూముల నుంచి ఖాళీ చేయిస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని, బాధిత రైతుల తరఫున చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించడం కంటే, రైతుల హక్కులు కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంబటి రాంబాబు సూచించారు.

